పూరి జగన్నాథ్ కు ప్రాణహాని.. పోలీసులకు కంప్లైంట్

దర్శకుడు పూరి జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించారు. ‘లైగర్’ సినిమా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఆ చిత్ర ఎగ్జిబిటర్లైన ఆడెపు శ్రీనివాస్ అలియాస్ వరంగల్ శీను, సినీ ఫైనాన్షియర్ శోభన్‌బాబు అలియాస్ శోభన్ తనను వేధిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాసిన లేఖను బుధవారం వ్యక్తిగత సహాయకుడు శ్రవణ్ ద్వారా పోలీసులకు పంపారు.
లైగర్ సినిమా నష్టాలపాలవడంతో దాదాపు 80 మందికిపైగా ఎగ్జిబిటర్లంతా గురువారం జూబ్లీహిల్స్‌లోని జగన్నాథ్ ఇంటికి రావాలని డిసైడ్ అయ్యారు. అయితే తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని, డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు బెదిరింపులకు పాల్పడ్డారంటూ పూరీ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియోలోనూ పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందనే అనుమానంతో రక్షణ కోరుతూ పోలీసులకు లేఖను రాశారు.