‘వారసుడు’ విశేషాలు.. వంశీ మాటల్లో.. !

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా చేశాడు దర్శకుడు వంశీపైడిపల్లి. ఆయన తదుపరి సినిమా కూడా మహేష్ తోనే ఉంటుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో కొద్దిరోజులు ఖాళీగా ఉన్న వంశీ.. అదే కథను కోలీవుడ్ స్టార్ విజయ్ కి వినిపించారు. అదే వారసుడు. తెలుగు, తమిళ్.. ద్విభాషా చిత్రం వారసుడు తెరకెక్కుతోందని అందరూ అనుకున్నారు. కానీ ఇది పక్కా తమిళ సినిమా. ఇతర భాషల్లోకి డబ్ చేస్తున్నాం అంతే అని వంశీ క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వారసుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అయినప్పటికీ.. అంతకు మించి ఉంటుంది. విజయ్‌ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్స్‌ ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారో అలాంటి చిత్రాన్నే చేస్తున్నాం. చిన్నా పెద్దా అందరూ చూసే సినిమా ఇది. సినిమా థీమ్‌కు న్యాయం చేసేలా టైటిల్‌ ఉండాలి. ఈ టైటిల్‌కు ఒక అర్థం ఉంది. సినిమా చూశాక ప్రేక్షకులకు అది తెలుస్తుంది. ఇటీవల విజయ్‌-రష్మికలపై ఓ సాంగ్‌ షూట్‌ చేశాం. చిత్రీకరణ పూర్తైన వెంటనే ఆమె నా వద్దకు వచ్చి.. ‘విజయ్‌తో డ్యాన్స్‌ చేయాలనేది నా కల. ఈ రోజుతో నా కల నెరవేరింది’ అని ఆనందం వ్యక్తం చేసిందని వంశీ చెప్పుకొచ్చారు.