ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : నిందితులకు రిమాండ్ తిరస్కరించిన న్యాయమూర్తి
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తొలి ట్విస్ట్ పడింది. ఈ వ్యవహారం కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రాత్రి సరూర్ నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురికి రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. అయితే రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని అనిశా కోర్టు న్యాయమూర్తి సూచించారు.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన నందకుమార్, ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్న మండెం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం నిర్వహిస్తున్న సింహయాజి, ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రి నుంచి శంషాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లోనే ముగ్గురు నిందితులను విచారించారు. పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నిందితులను సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపర్చారు.