ఎమ్మెల్యేల కొనుగోలు : నిందితులకు రిమాండ్, దర్యాప్తుపై స్టే

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు  అనుమతిస్తూ.. హైకోర్టు తీర్పునిచ్చింది. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలని.. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.

మరోవైపు మొయినాబాద్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తును సిట్‌ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ పై విచారించిన న్యాయస్థానం.. వచ్చే నెల 4వ తేదీ వరకు దర్యాప్తుపై స్టే విధించింది. ఈలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సహా ప్రతివాదులుగా ఉన్న 8 మందికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.