అజ్ఞాతంలో టీవీ5 చైర్మన్ బీఆర్.నాయుడు ?
గత ఐదు రోజులుగా టీవీ5 చైర్మన్ బీ.ఆర్.నాయుడు అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఈ నెల 19వ తేదీన బీఆర్ నాయుడికి సీఆర్పీసీ 41ఎ సెక్షన్ ని అనుసరించి 24వ తేదీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కరోనా విపత్తు సమయంలో 2005 విపత్తు నిర్వహణ యాక్ట్ ని ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా అలాగే అత్యంత విపత్కర పరిస్థితుల్లో వైద్యసేవల్లో నిమగ్నమై ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినేలా అవాస్తవ కథనాలు ప్రసారం చేసినందుకు నమోదైన కేసు విషయమై విచారణ నిమిత్తం బీఆర్ నాయుడుకి ఏపీ సీఐడీ ఈ నోటీసులు జారీ చేసింది.
అయితే సీఐడీ నుంచి నోటీసులు అందుకున్న మరు క్షణం నుంచి బీఆర్.నాయుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గత ఐదారు రోజులుగా ఆయన టీవీ5 సిబ్బందికి కానీ బంధు మిత్రులకు కానీ అందుబాటులో లేరని సమాచారం. ఇదిలావుండగా.. తనకు ఇచ్చిన సీఐడీ నోటీసుపై స్టే అర్ధిస్తూ బీఆర్.నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా సదరు ఉన్నత న్యాయస్థానం స్టే కూడా మంజూరు చేసింది. అయినప్పటికీ బీఆర్.నాయుడు అజ్ఞాతం వీడకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.