తీగల వంతెన దుర్ఘటన : 132 మంది మృతి, బీజేపీ ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి !

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగల వంతెన కూలిన ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. నావికాదళం, వాయుసేన, సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటి వరకు 177 మందిని రక్షించినట్లు గుజరాత్‌ సమాచార శాఖ తెలిపింది. ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రి మొత్తం నదిలో గాలింపు చర్యలను కొనసాగించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో బీజేపీ ఎంపీ ఏకంగా 12 మంది కుటుంబసభ్యులను కోల్పోవడం తీవ్ర విచారకరం. రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌భాయ్‌ కల్యాణ్‌జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

మోర్బీ నగరంలో మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ పాలన కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం సాయంత్రం కూలిన విషయం తెలిసిందే. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడంతో.. అధిక బరువును మోయలేక వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.అయితే కొన్నేళ్ల పాటు నిరుపయోగంగా ఉన్న ఈ వంతెనకు దాదాపు 7 నెలల పాటు మరమ్మతులు చేసి ఈ నెల 26నే తిరిగి తెరిచారు. ఈలోపే ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.