బంగారు భవిష్యత్ కోసం జనసేనను నమ్మాలి

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు అంటేనే దూకుడు మారుపేరు. కొన్ని విషయాల్లో వాళ్ల దూకుడు తగ్గించడానికి స్వయంగా పవన్ రంగలోకి దిగుతుంటారు. ఓపిక పట్టండడని హితువు పలుకుతుంటారు. అయితే ఈసారి పవనే వాళ్లకు దూసుకెళ్లండి అంటూ ఆదేశాలు జారీ చేసారు. ఉత్తరాంధ్ర జనసైనికులు ధైర్యంగా పోరాడండి. బలంగా ఎదుర్కోండి. కేసులు పెడితే మీతో పాటు నేనూ వస్తా. అవినీతి కోటల్ని బద్దలు కొడదాం అంటూ భరోసా ఇచ్చారు.
విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని ఆదివారం పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. రాజధాని పేరిట ఉత్తరాంధ్ర ప్రజల్ని వైకాపా నేతలు మోసం చేస్తున్నారని పవన్ విమర్శించారు. బంగారు భవిష్యత్ కోసం జనసేనను నమ్మాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వ మోసాన్ని ప్రజలు గ్రహించాలి. ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజకీయ అధికారం దక్కాలి. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామని అన్నారు.