ఢిల్లీకి కవిత.. ఇక వరుస మీటింగులు !
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో కవిత కీలక పాత్ర పోషించారని బీజేపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కవితకు సన్నిహితుడిగా చెప్పబడుతున్న అభిషేక్ రావు అరెస్ట్ కావడంతో.. అనుమానాలు మరింత బలపడుతూ వచ్చాయి.
ఇక ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కవిత బయట పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య కేసీఆర్ తో కలిసి ఢిల్లీ టూర్ కి వెళ్లారు. అది కూడా కేసు మాఫీ కోసం కేసీఆర్ చేస్తున్న లాబీయింగ్ లో భాగమేనని కమలం పార్టీ నేతలు ఆరోపించారు. అయితే ఇటీవల మళ్లీ బయట కనిపిస్తున్న కవిత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇటీవల తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.
ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా కవిత ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. ఢిల్లీ వరుస వరుస సమావేశాలతో ఆమె బిజీగా కనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ టీవీ ఛానల్స్, మీడియాతో ఆమె టచ్ లోకి వెళ్లనుంది. బీఆర్ఎస్ పార్టీని జాతీయస్థాయిలో ప్రమోట్ చేయనుందని చెబుతున్నారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసును కేంద్రం, ఎమ్మెల్యేల ఎర కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుకున్నట్టు కనబడుతుంది. ఈ రెండు కేసుల్లోనూ సంచలన విషయాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కేంద్రం-కేసీఆర్ కాంప్రమైజ్ కు వస్తే.. ఢిల్లీ లిక్కర్ కేసు ఎమ్మెల్యేల ఎర కేసుతో మాఫీ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.