మునుగోడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై గురువారం మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ సమీక్ష నిర్వహించారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..  చండూరు మున్సిపాలిటికీ రూ.50కోట్లు, చౌటుప్పల్‌ మున్సిపాలిటీకి రూ.30కోట్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్త 5 సబ్‌ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చండూరును త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని ప్రకటించారు. నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.