తెలంగాణ వలే భారత్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం

“నేను మీతో ఉంటా.. మీరు నాతో ఉండాలి. మీరు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. తెలంగాణ వలే భారత్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం. జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ చురుకైన పాత్ర పోషించాలి” అని కేసీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? అని ప్రశ్నించారు.

పోరాటాలు చేసిన సాధించుకున్న తెలంగాణలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం. వలసలతో వలవలపించేను పాలమూరు అనే  పాట ఉండేది. కానీ, ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడ్డ జిల్లా అంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోంది.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటే పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించటం లేదు. సంక్షేమంలో మనకు ఎవరూ సాటి లేరు.. పోటీ లేరు. ప్రతి వర్గానికి ఒక కార్యక్రమం చేపట్టి ఆదుకుంటున్నాం అన్నారు కేసీఆర్.

తెలంగాణ రైతు దేశంలోనే గర్వంగా తలెత్తుకుని నిలబడాలని భావించాం. కేంద్రాన్ని ప్రశ్నిస్తే  కేసీఆర్‌ .. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని ప్రధాని మోదీయే అన్నారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా? బంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీకి చెందిన 40మంది ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని మోదీ చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే ప్రజాస్వామ్య విధానమా? తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నలుగురు దొంగలు వస్తే..  వారిని పట్టుకుని జైల్లో పెట్టామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.