కేజ్రీవాల్, కేసీఆర్.. కొరకరాని కొయ్యలు ?
భారతదేశ రాజకీయ చిత్రపటం క్రమక్రమంగా కాషాయం కలర్ తో నిండిపోతుంది. దాన్ని సంపూర్ణం చేయాలనే పట్టుదలతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ప్రజాస్వామ్యంగా అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా.. కొన్ని రాష్ట్రాల్లో ఏక్ నాథ్ షిండేలను తయారు చేసి.. అధికారాన్ని సొంతం చేసుకుంటుంది. అయితే అది సాధ్యం కానీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ప్రజాబలంతో గెలవాలని చాన్నాళ్లుగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఢిల్లీతో పాటు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కమల వికాసం గ్యారంటీ అని ధీమాతో ఉన్నారు. అయితే తాజాగా వారి ఆశలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చల్లటి నీళ్లు చల్లినట్టు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బుధవారం వెలువడిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 15 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారాన్ని కోల్పోవడం విశేషం. దీంతో.. మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేని బీజేపీని రేపు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు గెలిపిస్తారని ఆశ పడటం దండగ ముచ్చట అని చెప్పవచ్చు. ఇక ఢిల్లీ కేజ్రీవాల్ మాదిరిగానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీ వ్యూహాలకు చెక్ పెడుతూ.. మరోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా తెలంగాణలోనూ కేసీఆర్ సర్కార్ ను గద్దె దింపడం బీజేపీ వల్ల కాదని మాటలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కేజ్రీవాల్, మమత, కెసీఆర్ తదితరులు కమలం పార్టీకి కొరకరానీ కొయ్యలుగా తయారయ్యారని అంటున్నారు.