ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇక జాతీయ పార్టీ

ఢిల్లీ గల్లీలో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అంచెలంచెలుగా ఎదుగుతూ పలు రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. తాజాగా జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటి బీజేపీకి ప్రత్యామ్నాయంగా అవతరించాలని కలలు కన్నది. కానీ ఆప్‌ ఆకాంక్షలకు బ్రేక్‌ పడింది. తాజా ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ ఆశలపై ఓటర్లు నీళ్లుచల్లారు. ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని ఆప్‌.. గుజరాత్‌ లో 5 స్థానాల్లో గెలిచి 12 శాతం ఓటు షేరు సాధించింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఖాతా కూడా తెరవలేదు.

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్‌.. దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, 6 శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి 12 శాతం ఓటు షేరు సాధించింది. దీంతో జాతీయ పార్టీగా అవతరించేందుకు ఆప్ అర్హత సాధించింది.