రేవంత్ ‘సకల జనుల సంఘర్షణ యాత్ర’

తెలంగాణలో రాజకీయాలు అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. సీఎం కేసీఆర్ ముందస్తుకుపోయే ఆలోచనలో ఉన్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసే యోచన చేస్తున్నారు. అదే జరిగితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్రల పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదు విడతలు పూర్తి చేసుకుంది. సీఎం కేసీఆర్ తరచూ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వైఎస్ఆర్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల, తెలంగాణ బీఎస్పీ ఇన్ ఛార్జి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా రోజులుగా జనాల్లో తిరుగుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ మాత్రం చాలా వెనుకబడి ఉంది. చాలా రోజులుగా పాదయాత్ర చేయాలని రేవంత్ భావిస్తున్నారు. అయితే పార్టీలో కుమ్ములాటల నేపథ్యంలో ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఆయన పాదయాత్ర ఫిక్సయినట్టు సమాచారం.

జనవరి ఆఖరి వారం నుంచి జనాల్లోకి వెళ్లే విధంగా ఆయన ప్రణాఌకలు సిద్ధం చేసుకున్నారు. . ‘సకల జనుల సంఘర్షణ యాత్ర’ పేరుతో రేవంత్ పాదయాత్ర కొనసాగనుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ముందుకు వెళ్లేలా కాంగ్రెస్ నేతలు(Congress Leaders) పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపి.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు చేస్తున్నారు. జనవరి నుంచి మెుదలై.. 5 నెలల పాటు యాత్ర ఉండేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.