కొవిడ్ ఎఫెక్ట్ .. ‘జోడో యాత్ర’కు బ్రేక్ !

చైనా సహా పలు దేశాల్లో కరోనా మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లేఖ రాశారు. ఈ క్రమంలో భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత కూడా ఆయన లేఖ రాశారు. కొవిడ్‌ నిబంధనలను పాటించలేకపోతే.. యాత్రను కొంతకాలం నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

‘భారత్‌ జోడో యాత్ర’ కారణంగా తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తూ రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు డిసెంబరు 20న కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. యాత్రలో పాల్గొన్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్ సుక్కు కరోనా బారిన పడిన విషయాన్ని ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే దేశ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. అయితే దీనిపై కాంగ్రెస్ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జోడో యాత్రతో రాహుల్‌ గాంధీకి సోషల్‌మీడియాలో భారీ ఆదరణ లభిస్తోంది. దీన్ని చూసి భాజపా భయపడుతోంది. అందుకే యాత్రను అడ్డుకోవాలని కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు.