స్వయంగా డైరెక్టరే లీక్ చేస్తే ఎలా ?

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకు ఈ సినిమా నుంచి ఓ చిన్న సీన్ లీక్ కాకుండా చూసుకోవడం దర్శకుడిగా బాబీ బాధ్యత. కానీ మెగాస్టార్ వీరాభిమానిగా ఆయనే తట్టుకోలేకపోతున్నారు. ముందుగానే లీకులు ఇచ్చేస్తున్నారు.

క్రిస్మస్ , న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆదివారం బాబీ మెగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హిట్ కొట్టబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. ‘ఇంద్ర’ రేంజ్ లో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. ఇక్కడి వరకు ఓకే కానీ.. ఓ చిన్న లీకు ఇస్తున్నానంటూ.. కీలకమైన సీన్లు చెప్పేశారు.

“సినిమా మొదలైనప్పటి నుంచి వీరయ్య ఊసు, ఉనికి వచ్చిన ప్రతిసారీ అభిమానులు తప్పకుండా ఈలలు వేస్తారు. చిరంజీవి కనపడకపోయినా ప్రతి సీన్‌లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయన పరిచయ సన్నివేశాలను పెను తుపానులో సముద్రంపై షూట్‌ చేశాం. డూప్‌ లేకుండా సుమారు 10 రోజులపాటు ఇంట్రో సీన్స్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఓ వైపు వాన, మరోవైపు అలల తాకిడి.. మేమంతా ఎంతో కంగారుపడ్డాం. ఆయన మాత్రం కూల్‌గా చేసేశారు. ఎవరూ ఆందోళనకు గురికాకండి.. ఈ సారి హిట్‌ కొడుతున్నాం” అని బాబీ చెప్పారు.