రివ్యూ : వాల్తేరు వీరయ్య
చిత్రం : వాల్తేరు వీరయ్య (2023)
నటీనటులు : చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్, కేథరిన్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, బాబీ సింహా తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : కె.ఎస్.రవీంద్ర
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
రిలీజ్ డేట్ : 13 జనవరి, 2023
సంక్రాంతి పండుగ పూట మాస్ జాతర కొనసాగుతుంది. నిన్న బాలయ్య ‘వీరసింహారెడ్ది’ ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ అయింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. శృతి హాసన్ హీరోయి. బాబీ సింహా విలన్ పాత్రలో నటించారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. టీజర్, ట్రైలర్.. పాటలు ప్రచార చిత్రాలతో దుమ్మురేపిన వీరయ్య అంచనాలను అందుకున్నాడా ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
వైజాగ్ లోని జాలర్లపేటలో ఉంటాడు వాల్తేరు వీరయ్య.0 అవసరమైనప్పుడు నేవీ అధికారులకి కూడా సాయం చేస్తుంటాడు. పోర్ట్‌లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరుమీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సాల్మన్ సీజర్ (బాబీ సింహా) వల్ల పోలీస్ అధికారి సీతాపతి (రాజేంద్రప్రసాద్) సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సాల్మన్‌ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగిన వాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం రూ. 25 లక్షలకి ఇద్దరి మధ్యా ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సాల్మన్ సీజర్‌తోపాటు, అతని అన్న కాలా అలియాస్ మైఖేల్ సీజర్ (ప్రకాశ్‌రాజ్)కి ఎర వేస్తాడు. ఇంతకీ మైఖేల్కీ, వీరయ్యకీ సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్‌సాగర్ (రవితేజ) గతమేమిటి? మైఖేల్‌పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేది మిగతా కథ.
నటీనటుల పర్ఫామెన్స్ :
మెగాస్టార్ ఊర మాస్ అవతారంలోనూ … తన మార్క్ కామెడీ, యాక్షన్ అంశాలతో అలరించి చాలా కాలమైంది. మళ్లీ ఆ ఇమేజ్‌ని తెరపై చూపించాలనే తపనే బాబీలో ఎక్కువగా కనిపించింది. మంచి ఎలివేషన్స్‌తో చిరంజీవి ఒకప్పటి అవతారాన్ని గుర్తు చేశాడు దర్శకుడు. చిరంజీవి తన నటనతో అభిమానులకి పూనకాలు తెప్పించారు. కథ మలేషియాకి వెళ్లాక అక్కడక్కడా చిరంజీవి మార్క్ కామెడీపైనే ప్రధానంగా సన్నివేశాలు సాగుతాయి. ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రకి రవితేజ బలాన్నిచ్చారు. ఆ పాత్ర కోసం ఆయన్ని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం. ద్వితీయార్ధంలో చిరంజీవి, రవితేజ మధ్య బంధం, ఆ నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
కథానాయికలకి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. శ్రుతిహాసన్ పోరాట ఘట్టాల్లోనూ కనిపిస్తుంది. కేథరిన్ కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ప్రకాశ్‌రాజ్, బాబీ సింహా పాత్రల్లో బలం లేదు. వెన్నెల కిషోర్, సత్యరాజ్ అక్కడక్కడా నవ్వించారు. రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
కెమెరా విభాగం పనితీరు ఆకట్టుకుంటుంది. సముద్రం నేపథ్యంలో సన్నివేశాలు మొదలుకొని పాటలు, పోరాట ఘట్టాల్లో హంగులు మెప్పిస్తాయి. దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతంపై ప్రభావం చూపించారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. దర్శకుడు బాబీ తెలిసిన కథనే అభిమానులకి నచ్చే అంశాలతో తెరపైకి తీసుకొచ్చాడు. సీనియర్ రచయిత కోన వెంకట్ స్క్రీన్‌ప్లే బృందంలో ఉన్నా కథనం పరంగా పెద్దగా ప్రభావం కనిపించదు.
ప్లస్ పాయింట్స్ :
చిరు లుక్, నటన
యాక్షన్ సీన్స్
డ్యాన్స్, అక్కడక్కడ కామెడీ
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
రొటీన్ కథనం
రేటింగ్ : 3.5/5