బీఆర్ఎస్ లోకి శరత్‌కుమార్ ?

దేశవ్యాప్తంగా బీఆర్ ఎస్ లోకి వలసలు ఊపందుకోనున్నాయా ? అంటే అవుననే అంటున్నారు. శుక్రవారం ఒడిషా మాజీ సీఎం గులాబీ కండువ కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కారెక్కారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై కవితతో ఆయన చర్చించినట్లు సమాచారం. భారత్ రాష్ట్ర సమితి (భారాస) స్థాపన ఉద్దేశం, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరత్‌కుమార్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ బీఆర్ ఎస్ లో చేరే అవకాశం ఉందని వార్తలువినిపిస్తున్నాయి.