రేవంత్, బండి లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

‘ఏది పడితే అది మాట్లాడతా. ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తా’ అంటే కుదరదు అంటున్నారు మంత్రి కేటీఆర్. టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీస్ కేంద్రంగానే జరిగింది. కేటీఆర్ పీఏ తిరుపతి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాదు.. ఓ మండలానికి చెందిన అభ్యర్థులు ఎక్కువగా 100 కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్, సంజయ్ లకు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. గురువారం సిట్ ముందు హాజరైన రేవంత్ .. కేటీఆర్ కు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని నిలదీసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సమాచారం. ఇక రేపు బండి సంజయ్ సిట్ ముందు హాజరుకావాల్సి ఉంది. మరోవైపు, తనపై వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్, బండి లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు.

ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న ప్రతిపక్షాల కుట్రలు సాగనివ్వం. ఓ దురదృష్టకర ఘటనను చూపి.. ఉద్యోగాలను ఆపాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మొత్తానికి.. పేపర్ లీకేజీ వ్యవహారం కాస్త.. నిరుద్యోగుల పట్ల ఏ పార్టీ ఎంత వరకు నిబద్ధతగా ఉంది నిరూపించుకోవాల్సిన పరిస్థితుల వైపు టర్న్ తీసుకోబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ శీల పరీక్షను ఎదుర్కొని.. ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తుంది.