RCBని ఓడించిన దినేష్ కార్తీక్.. నెటిజన్స్ ఫైర్ !

కోల్ కతా – గుజరాత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు మస్త్ మజా పంచిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ లో రింకు సింగ్ ఏకంగా 5 సిక్సర్లు బాది కేకేఆర్ కు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క మ్యాచ్ తోనే రింకూ స్టార్ అయిపోయాడు. ఇక సోమవారం బెంగళూరు-లక్నో జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో విన్ అయింది.

లక్నో ముందు 213 పరుగుల భారీ లక్ష్యం. మొదటి ఓవర్ లోనే ఫామ్‌లో ఉన్న కైల్‌ మేయర్స్‌ (0) డకౌట్. మూడో ఓవర్ లో దీపక్ హుడా (9) ఔట్. ఆ తర్వాత ఓవర్ లో కృనాల్‌ పాండ్య కూడా ఔట్‌. 4 ఓవర్లకు స్కోరు 23/3. ఇక లక్నో గెలుపు దాదాపు కష్టమే అనుకున్నారంతా. కానీ స్టాయినిస్‌ (65; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టడంతో ఆశలు చిగురించాయి. ఇంతలో బిగ్ షాక్. 11వ ఓవర్ లో స్టాయినిస్‌ ఔట్. 11 ఓవర్లకు స్కోరు 105/4.

లక్నో గెలుపు కోసం మరో 108 పరుగులు కావాలి. అయితే స్టాయినిస్‌ టాప్ గేర్ లో అడాడంటే.. పూరమ్ అంతకుమించి విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ. 18 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అయితే 17 ఓవర్లో చివరి బంతికి పూరమ్ ఔట్ కావడంతో మళ్లీ ఉత్కంఠ. అప్పటికీ లక్నో స్కోరు 189/6. గెలుపు కోసం 18 బంతుల్లో 24 పరుగులు కావాలి. అప్పటివరకు సపోర్టింగ్ రోల్ పోషిస్తున్న బదోని (30) నుంచి కొన్ని మెరుపులు. దీంతో ఆఖరి ఓవర్ లో కావాల్సి కేవలం 5 పరుగులే. కానీ ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ తో అంత ఈజీ కాలేదు. బదోని హిట్ వికెట్, ఉనద్కత్‌ (9) క్యాచ్ ఔట్ తో.. నరాలు తెగే ఉత్కంఠ. ఆఖరి బంతికి ఒక పరుగు అవసరం కాగా..  బైస్‌ రూపంలో ఆ పరుగు రావడంతో లక్నో విజయతీరాలకు చేరింది.

అంతకుముందు విరాట్ కోహ్లీ (61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), డు ప్లెసిస్ (79*; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (59; 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న గ్రౌండ్ లో ఈ భారీ లక్ష్యం చిన్నబోయింది. లక్నో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆదివారం కోల్ కతా – గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరును తలదన్నేలా బెంగళూరు-లక్నో మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులను అలరించింది.

దినేష్ కార్తీక్ వల్లే మ్యాచ్ పోయింది ?

ఆఖరి ఓవర్ లో లక్నో కి కావాల్సింది కేవలం 5 పరుగులే. కానీ హర్షల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ చేయడం.. మొదటి ఐదు  బంతులకు 4 పరుగులే వచ్చాయి. రెండు వికెట్లు పడ్డాయి. ఆఖరి బాల్ కి ఒక్క పరుగు అవసరం కాగా.. అది బైస్ రూపంలో వచ్చింది. ఆవేశ్ ఖాన్ బంతి మిస్ కావడం.. దాన్ని దినేష్ కార్తీక్ సరిగ్గా అందుకోకపోవడంతో టై కావాల్సిన మ్యాచ్ లో లక్నో గెలిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ డీకే ను టార్గెట్ చేశారు. తాజా మిస్టేక్ ను ఎత్తిపొడుస్తూ.. గతంలో అతడు చేసిన తప్పిదాలను వైరల్ చేస్తున్నారు.