కర్ణాటక మంత్రి ఆస్తి రూ.1,609 కోట్లు !

కర్ణాటకకు చెందిన మంత్రి ఎం.టి.బి.నాగరాజు ఆస్తి అక్షరాల రూ.1,609 కోట్లు. ఈ మేరకు సోమవారం దాఖలుచేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భార్య పేరిట రూ.536 కోట్ల చరాస్తులు, రూ.1,073 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీరిద్దరికీ రూ.98.36 కోట్ల రుణాలున్నాయని ప్రకటించారు. హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీచేస్తున్నారు.

2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలిచిన ఆయన అప్పట్లో రూ.1,120 కోట్ల ఆస్తులు ప్రకటించారు. అనంతరం జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారం చేపట్టే క్రమంలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలలో ఈయన కూడా ఒకరు. బీజేపీ చేరిన తర్వాత 2020 ఉప ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లోనూ రూ.1,220 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఈ ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ రూ.500 కోట్లు పెరిగి రూ.1,609 కోట్లకు చేరుకుంది. అయితే ఎన్ని కోట్లు పెరిగాయి అని మాత్రమే అడగండి. ఎలా పెరిగాయి మాత్రం అడగొద్దంటూ కాంగ్రెస్ నేతలు నాగరాజుపై సటైర్లు వేస్తున్నారు.