‘పోకిరి’ పదిహేడేళ్ల పండగ
ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను.
గన్నూ నాదే, శృతీ నాదే!
సినిమాలు జూట్లేదేటీ?
నేనెంత ఎదవనో నాకే తెలియదు.
ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండు బ్లాక్ అవుతుందో, ఆడే పండుగాడు
పై డైలాగ్స్ వినగానే అర్థమైపోయి ఉంటుంది. ‘పోకిరి’ డైలాగ్స్ అని. అవునూ.. 2006, ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోకిరి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా గతి ని మార్చేసింది. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా రూ. 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మహేష్ బాబును స్టార్ హీరోను చేసింది. ఇలియానాకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి రూ. కోటి పారితోషికం అందుకున్న హీరోయిన్ గా ఇలియానా ను స్థాయిని పెంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే ఉన్నాయి.
పోకిరి విడుదలై నేటికి 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా #17YearsForGameChangingIHPokiri యాష్ ట్యాగ్ ను మహేష్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. పోకిరి పోస్టర్లు.. డైలాగులు.. వీడియో బిట్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
అయితే పోకిరి సినిమా పట్టాలెక్కక ముందు కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి. పోకిరి సినిమా స్క్రిప్ట్ పూరీ జగన్నాధ్ తన తొలిచిత్రం బద్రి చిత్రీకరిస్తున్న సమయంలోనే రాసుకున్నారు. అప్పటికి ఆ ప్రాజెక్టుకు ఆయన పెట్టుకున్న పేరు “ఉత్తమ్సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ”. మొదట ఈ కథని రవితేజతో తీయాలనుకున్నారు. ఆయన బిజీగా ఉండటంతో.. ఓ దశలో సోనూసూద్ ని అనుకున్నారు. ఆ తర్వాత ఈ కథ మహేష్ దగ్గరకు వెళ్లింది. టైటిల్ లో , కథలో సిక్కు పదం తొలగించాలని కోరడంతో.. టైటిల్ ను పోకిరిగా మార్చాడు పూరి. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ గా ముందుగా అయేషా టాకియా, కంగనా రనౌత్ తదితరులను అనుకున్నారు. ఆఖరికి ఆ లక్కీ ఛాన్స్ ఇలియానాకు దక్కింది. కేవలం 70 రోజుల్లోనే పోకిరి షూటింగ్ పూర్తయింది. ఎక్కువ సీన్స్ ను సింగిల్ టేక్ లోనే ఒకే చేసేశారు.
రిమేక్ లు బ్లాక్ బస్టర్ హిట్టే !
పోకిరి మాత్రమే కాదు.. ఈ సినిమా రిమేక్ లు కూడా బ్లాక్ బస్టర్ హిట్టే. ఈ సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో పోక్కిరి అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో వాంటెడ్ అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా పోర్కి అన్న పేరుతోనూ, బెంగాలీలో షకీబ్ ఖాన్ హీరోగా రాజోట్టో పేరిట రీమేక్ చేశారు. ఈ రిమేక్ లన్నీ సంచలన విజయాన్ని నమోదు చేశాయి.