మహా ఉత్కంఠ.. ఏక్‌నాథ్ శిండే అనర్హతపై తుది తీర్పు నేడే !
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ శిండే ప్రభుత్వం ఉంటుందా ? కుప్పకూలుతుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై ఈరోజు సుప్రీం తుది తీర్పును వెల్లడించనుంది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. 9 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మార్చి 16న తన తీర్పును రిజర్వ్ చేసింది.
శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిండేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా శిందే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్ శిందే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పులను వెలువరించనున్న నేపథ్యంలో మహా ఉత్కంఠ నెలకొంది.