నీట మునిగిన తెలంగాణ !ఇవాళ కూడా భారీ వర్షాలు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ నీట మునిగింది. వరదలు పల్లెలు, పట్టణాలను ముంచెత్తాయి. ప్రాజెక్టులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది. వరదల్లో నలుగురు గల్లంతయ్యారు. ఇళ్లు, చెట్లు ఎక్కి గ్రామస్థులు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఆర్మీ రంగంలోకి దిగి గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలో విషాదం చోటుచేసుకుంది. చెరువుకు గండి పడి.. ఇంట్లో నిద్రిస్తున్న బండ సారయ్య (60), బండ సారమ్మ (58), బండ రాజమ్మ (80) కొట్టుకుపోయారు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్ట్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. దయ్యాల వాగు వరద ఉధృతి లో ముస్లిం ఫ్యామిలీ గల్లంతయింది. తల్లి ఫౌజియా (35), ఇద్దరు కుమారులు సద్దాం హుస్సేన్ (2), తన్వీర్ అలీ(4) కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు తన్వీర్ అలీ మృతదేహం మాత్రమే లభ్యం అయింది. దీంతో ములుగులో తీవ్ర విషాద ఛాయాలు నెలకొన్నాయి.

హన్మకొండ వేలూరు కన్నారంలో బైక్ నడుపుతూ బ్రిడ్జి దాటుతుండగా కొట్టుకుపోన మహేందర్ అనే వ్యక్తి మృతి చెందారు. వరంగల్ నగరంలో చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాజీపేట రైల్వే స్టేషన్ లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ హంటర్ రోడ్ లో 200 మంది హాస్టల్ విద్యార్థినిలు వరదలోచిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ ను పొడగిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదు :

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. ఇప్పటివరకు 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన వర్షపాతమే (51 సెం.మీ.) అత్యధికం. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ., 200 కేంద్రాల్లో 10 సెం.మీ.పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ :

గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. అసాధారణమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్‌పర్తి – కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు నిలవడంతో.. మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 9 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233), సిర్పూర్‌ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతి – కరీంనగర్ (12761), కరీంనగర్ – తిరుపతి (12762), సికింద్రాబాద్ – సిర్పూర్‌ కాగజ్ నగర్ (12757), సిర్పూర్‌ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది.

ఇవాళ కూడా విద్యాసంస్థలు బంద్ :

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గతవారం భారీ వర్షాల కారణంగా మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు రాగా.. ఈ వారం మరో మూడ్రోజులు విద్యాంసంస్థలు బంద్ అయినట్లు అయింది.