కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఉజ్వల పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని రూ.300లకు పెంచింది. తెలంగాణలో పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ తీర్మానానికి ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వాటాను తేల్చాలని కృష్ణా ట్రైబ్యునల్‌కు ఆదేశించినట్టు తెలిపారు.