దోస్త్ మేరా దోస్త్.. పల్లా-ముత్తిరెడ్డి స్నేహ గీతం.. పరేషాన్ లో జనగామ ప్రజలు !
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇది వందశాతం నిజమని జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రుజువు చేశారు. 115 అభ్యర్థులతో కూడిన బీఆర్ఎస్ లిస్టు ను సీఎం కేసీఆర్ ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టారు. ఇందులో జనగామ ఒకటి. ఈ స్థానం కోసం త్రిముఖ పోటీ కనబడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మాత్రం పల్లా వైపు మొగ్గు చూపింది. ఆయనకు టికెట్ ఖారారు చేసినట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే ముత్తిరెడ్డి నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పల్లా పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
మంత్రి కేటీఆర్ పల్లా, ముత్తిరెడ్డిని ప్రగతి భవన్ కు పిలిచి రాజీ కుదిర్చారు. ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. వెంటనే బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రోజునే పల్లాపై మరోసారి విరుచుకుపడ్డారు ముత్తిరెడ్డి. పల్లా భూ కబ్జా దారుడు. ఆయన అవినీతికి అంతే లేదని మండిపడ్డారు. అంతేకాదు.. జనగామ టికెట్ తనకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితి శృటి మించుతుండటంతో.. ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు ఎంట్రీ ఇచ్చారు. బుధవారం జనగామ నిర్వహించిన కార్యక్రమంలో పల్లా, ముత్తిరెడ్డిల మధ్య గ్యాప్ తొలగించారు. సభా వేదికగానే తన తదుపరి వారసుడు పల్లా. ఇకపై జనగామ అభివృద్ధి బాధ్యత ఆయనదే అన్నారు. ఇద్దరు నేతలు స్వీట్లు పంచుకున్నారు. పల్లా అయితే ముత్తిరెడ్డి కాళ్లు పట్టుకున్నారు. ఇదంతా చూసిన జనాలు పక్కున నవ్వారు.
ఇక మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో ఎమోషన్స్ పండించారు. బీఆర్ ఎస్ లో ఇట్లుటది. కాంగ్రెస్ పార్టీలో ఇలా జరుగుతుందా ? అని ప్రశ్నించారు. మా ఇద్దరు నేతలు కలిసిపోయారు. బేదాభిప్రాయాలు తొలగిపోయాయి. ఇక పల్లాను గెలిపించే బాధ్యత జనగామ ప్రజల మీద ఉందని తనదైన శైలిలో ప్రసంగించారు. వాస్తవానికి జనగామలో గెలిచింది పల్లా కాదు. హారీష్ రావునే. ఎందుకంటే ? ఇక్కడ కేసీఆర్ కుటుంబం తలొక్క అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వైపు మొగ్గు చూపగా.. మంత్రి కేటీఆర్.. ఆయన బినామీగా పేరున్న ఎమ్మెల్సీ పోచంపల్లికి టికెట్ ఇవ్వాలని భావించారు. హరీష్ రావు పల్లాకు మద్దతు ఇచ్చారు. చివరికి తండ్రి కొడుకులను కాదని హరీష్ తన పంతం నెగ్గించుకున్నారు. జనగామ బరిలో పల్లాను నిలిపారు. అంతేకాదు.. ఆయనపై ఉన్న అసమ్మతిని కూడా చెరిపేశారు.