త్వరలో.. రూ.2 లక్షల రుణమాఫీ ! 27న మరో రెండు హామీల అమలు ప్రారంభం
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మేడారం మహా జాతర సందర్బంగా శ్రీ సమ్మక్క-సారలమ్మలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ,గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీనిపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు మంచి శుభవార్త చెప్పబోతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
త్వరలోనే ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను నియమిస్తాం…
త్వరలోనే ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, జర్నలిస్టులు పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే వారి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వాళ్లు ఇద్దరి (బీజేపీ-బీఆర్ఎస్ను ఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి సందర్శనకు రావాలి…
దక్షణ కుంభమేళాలాంటి ఈ జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని తాము ఎన్ని సార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని ముఖ్యమంత్రి హితవు పలికారు. దక్షణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క-సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి సందర్శించుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. గతేడాది ఫిబ్రవరి ఆరో తేదీన మేం ప్రారంభించిన యాత్ర విజయవంతమై ఈ రోజు అధికారంలోకి వచ్చి అధికారికంగా జాతరను నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో ఇంకా సమయం ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గుళ్లలో సంపన్నులు, ఆగర్భ శ్రీమంతులు గుళ్లకు వెళితే వజ్రాలు, వైఢూర్యాలు ఇచ్చే సంప్రదాయం ఉందని, కానీ అత్యంత పేదలు, నిరుపేదలు బాధపడుతుంటే సమ్మక్క కలలో ప్రత్యక్షమై బెల్లం ఇస్తే అదే బంగారంగా భావిస్తామని చెప్పడంతోనే ఇక్కడ బెల్లం బంగారమైందని ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడకు రాలేని భక్తులకు ఆన్లైన్ ద్వారా బంగారం (బెల్లం) పంపించే ఏర్పాట్లను దేవాదాయ శాఖ చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.