రిజర్వేషన్ల రద్దు పై మీ వైఖరేంటి ? కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన సీఎం రేవంత్ !

రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ వైఖరేంటో కేసీఆర్ స్పష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అమెరికా నుంచి అమలాపురం వరకు.. చంద్ర మండలం నుంచి చింతమడక వరకు  కేసీఆర్ అన్నీ మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం మాట్లాడటంలేదు. ప్రశ్నించడంలేదు. గతంలోనే కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చేయాలన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్ఎస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.  వంద రోజుల మా ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటూ బస్సుయాత్ర చేస్తున్నావ్ కదా.. ! రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోదీపై నీ కార్యాచరణ ఎక్కడుంది? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మీ టార్గెట్ వంద రోజుల మా ప్రభుత్వమా? పదేళ్లు ప్రజలను మోసం చేస్తున్న మోదీపైనా? అని నిలదీశారు.

బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం :

బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. మల్కాజిగిరిలో బీజేపీ గెలుస్తుందని నిన్న మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు. నిజంగా బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలిని డిమాండ్ చేశారు. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఎమ్మెల్యేను కేటీఆర్ సమర్ధించడం దేనికి సూచన ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఐదు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కి తాకట్టు పెట్టిందని తాను మొదట్నుంచీ చెబుతున్నా. గతంలో తనని ఎంపీగా ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టిన కేటీఆర్… ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం ఒక్క సమావేశం పెట్టారు. ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడలేదు. కేసీఆర్, కేటీఆర్ కు వ్యతిరేకంగా ఈటెల మాట్లాడటం లేదు. పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని నాపై విమర్శలు చేస్తున్నారు. ఏందయ్యా రాజేందర్.. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్. కేసీఆర్, కేటీఆర్ భూములు అమ్మినప్పుడు రాజేందర్ కు భూములు గుర్తు రాలేదా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కమిట్మెంట్ తో మేం మాట్లాడుతుంటే మాపై విమర్శలు చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయొద్దా? కేసీఆర్ ను సూటిగా డిమాండ్ చేస్తున్నా… బీజేపీతో మీకు ఒప్పందం లేకపోతే తక్షణమే మీ మేడ్చల్  ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించండి. లేకపోతే తెలంగాణ సమాజం మీ ఒప్పందం బయటపడినట్లే భావిస్తుందని అన్నారు. అమాయకంగానో, అత్యుత్సాహంతోనో మేడ్చల్ ఎమ్మెల్యే కుండ బద్దలు కొట్టారు. ఇక కేసీఆర్, కేటీఆర్ గుండు పగలగొట్టడమే మిగిలి ఉందన్నారు. 

కేసీఆర్ కు ఇంత అసహనం ఎందుకు.. ?

కేసీఆర్ కు ఇంత అసహనం ఎందుకు.. ? అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుందా? అని రేవంత్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాట ఇస్తున్నా… ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతాం. తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా… రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి అన్నారు.