సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. కానీ పసలేదు !
ఇన్నాళ్లకి సోషల్ మీడియా పవరేంటో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అర్థమైంది. తాజాగా ఆయన కూడా సోషల్ మీడియాలోకి తెరంగేట్రం చేశారు. శనివారం బీఆర్ఎస్ 24వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా కేసీఆర్ సోషల్ మీడియాలో ఖాతా తెరిచారు. ట్విట్టర్, ఇన్ స్టా అకౌంట్లు ప్రారంభించారు. క్షణాల్లోనే ఆయన ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లోకి వెళ్లలేదు. కానీ వేలల్లోకి చేరింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమి సోషల్ మీడియానే కారణమని కేసీఆర్, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలంతా ముక్తకంఠంతో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. ఆ తర్వాత కరెంట్ కోతలపై మరో పోస్ట్ పెట్టారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుండగా.. మూడు సార్లు కరెంట్ పోయింది. నియోజకవర్గాల్లో అయితే రోజుకి పదిసార్లు కరెంట్ పోతుందని మా పార్టీ నేతలు చెప్పారు. తెలంగాణ ఆగమైతోతుంది. ఇప్పటికైనా మేధావులు, విద్యావంతులు, ప్రజలు ఆలోచన చేయాలని రాసుకొచ్చారు. ఐతే ఆయన రాతలో పదను కనిపించలేదు. కేసీఆర్ మార్క్ భూతద్దంలో పెట్టిన కానరాలేదు. తెలంగాణ యాస, భాష కేసీఆర్ బలం. ఆయన స్వయంగా ట్వీట్ చేస్తే .. కత్తితో నరికినట్టు ఉంటది. కానీ ఆయన సోషల్ మీడియా అకౌంట్లను మరొకరు హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ మార్క్ కనిపించలేదు. పసలేదని ఆయన అభిమానులే ముక్కువిరుస్తున్నారు.