ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్ !
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నరు. ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా సరూర్ నగర్ కార్నర్ మీటింగ్ సీఎం రేవంత్ మరోసారి కారు, కమలం పార్టీలపై ఎటాక్ చేశారు. పదేళ్ల నుంచి తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నప్పటికి సమస్యలు పరిష్కారం కాలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పైగా తెలంగాణకు వచ్చిన అనేక సంస్థలను మోదీ రద్దు చేశారని మండిపడ్డారు.
హైదరాబాద్ కు కొత్త మెట్రో లైన్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదు. మూసీ ప్రక్షాళన కోసం అణా పైసా నిధులు కేంద్రం ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా మోదీ ఒప్పుకోలేదని సీఎం రేవంత్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల రద్దు కు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దుపైన నేను మాట్లాడితే మోదీ ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారు. గుజరాత్ లో లేని పథకాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇస్తున్నాడని అభినందించకుండా ప్రధాని మోదీ తిట్ల దండకం అందుకున్నడని ఫైర్ అయ్యారు. తనని తిడితే మోదీ కడుపులో ఆయాసం తప్ప ఏమీ రాదు. మోదీ తెలంగాణకు వచ్చిండు.. గాడిద గుడ్డు తెచ్చాడు. తెలంగాణ కు గాడిద గుడ్డు, గుజరాత్ కు బంగారు గుడ్డు ఇస్తావా మోదీ అని ప్రశ్నించారు.
డిసెంబర్ లో కేసీఆర్ ను బండకేసి కొట్టి వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టారని సీఎం రేవంత్ అన్నారు. ఆట అయిపోలేదు. సెమీ ఫైనల్స్ గెలిచాం.. ఫైనల్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీం తలపడుతున్నాయి. తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ కెప్టెన్ , గుజరాత్ కు మోదీ , అమిత్ షా కెప్టెన్ లు. యువత తెలంగాణ టీంను గెలిపించుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. రాబోయే నాలుగున్నరేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. నగర సమస్యలు పరిష్కరించేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. నరేంద్ర మోదీ ఉద్దెర చుట్టం మాత్రమే.. తినిపోవడానికే ఆయన తెలంగాణ కు వచ్చేది అన్నారు. బీజేపీ నాయకులారా తెలంగాణ ను గుజరాత్ వాళ్లకి తాకట్టు పెట్టొద్దు. ఎన్టీఆర్ నగర్ పట్టాల సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తాం. చేవెళ్ల రంజిత్ రెడ్డి ని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.