కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ముహూర్తం ఖరారు ?
లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తనతో చర్చలు జరిపారని కుండబద్దలు కొట్టారు.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ మారొద్దని స్వయంగా కేసీఆర్ చెప్పిన నేతలు వినలేదు. ఇప్పటికే కీలక నేతలు పార్టీ వీడారు. కారు పార్టీ దాదాపు ఖాళీ అయింది. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత కారు పార్టీ పూర్తిగా కనుమరుగు కానుందని కాంగ్రెస్, బీజేపోళ్లు కూడా అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే కూడా అలాగే ఉంది. తాజా ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీకి ఒకట్రెండు సీట్లు రావడమే గగనంగా ఉంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టై తీహార్ జైల్ లో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్ లకు ఉచ్చుబిగుస్తోంది. ఇక కాళేశ్వరం అవినీతి బాగోతం గురించి కథలు కథలుగా చెప్పుకొనే పరిస్థితి. కాళేశ్వరం ఫైల్స్ తెరిస్తే కల్వకుంట్ల ఖాందాన్ మొత్తం జైల్ లోకి వెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి లాంటోళ్లు బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయం అంటున్నారు. మరీ నిజంగానే కారు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందా ? బౌన్స్ బ్యాక్ అవుతుందా ? అన్నది చూడాలి.