కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది : ప్రధాని

కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని ప్రధాని మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, భారాసలకు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. బీజేపీ మాత్రం దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ‘కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం..’ ఈ నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే.. నాణేనికి బొమ్మాబొరుసులాంటివి అని ప్రధాని విమర్శించారు. తెలంగాణ నుంచి దిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్ ట్యాక్సుపైనే చర్చ జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కంటే ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్లు మించిపోయాయి. ఇక సభ ప్రారంభానికి ముందు శ్రీరాజరాజేశ్వరస్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భక్తులకు అభివాదం చేశారు.
