అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష

తెలంగాణ సర్కార్ అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ టీచర్లకు పదవీ విరమణ తర్వాత రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రెండు, మూడు రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. 

హైదరాబాద్ రహమత్ నగర్‌లో ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ అనే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై స్పందించారు. రెండు మూడ్రోజులల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన అధికారిక జీవో విడుదల చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని చెప్పారు. ఉద్యోగులకు సమస్యలు పరిష్కరిస్తామని, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తామన్నారు. మంత్రి సీతక్క ప్రకటనతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 10 రద్దు సహా మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నారు.