పంత్ సెంచరీ.. వెరీ వెరీ స్పెషల్

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ సెంచరీ సాధించాడు. 128 బంతుల్లో 109 పరుగులు చేసిన పంత్, ఈ శతకంతో భారత్‌ తరఫున వికెట్‌ కీపర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో ధోనీని సమం చేశాడు. ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో ఆరు శతకాలు చేయగా, పంత్ 58 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు.

ఈ సెంచరీ పంత్‌కు ప్రత్యేకం ఎందుకంటే, కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చాలా రోజుల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అతడు మళ్లీ నడుస్తాడా అనే సందేహాలు ఉన్నప్పటికీ, తన విల్ పవర్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో ఢిల్లీకి సారధ్యం వహించిన పంత్, అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా తన ప్రతిభను చాటాడు.

భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసి, బంగ్లాదేశ్‌ ఎదుట 515 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌటైంది.