‘క’ కంటెంట్ ఉన్న సినిమా.. అందుకే దీపావళి బరిలో… !

ఇటీవలి కాలంలో విడుదలైన టీజర్, ట్రైలర్లలో అందరినీ ఆకట్టుకున్న కంటెంట్ ‘క’లో కనిపించింది. టైటిల్ నుండి ట్రైలర్ వరకు ఏదో ఒక రూపంలో ప్రభావం చూపిస్తూ వచ్చింది ‘క’. కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హీరోగా నటిస్తూనే, నిర్మాణ బాధ్యతలు కూడా దగ్గరుండి చూసుకున్నాడు. ప్రమోషన్లు కూడా తానే నిర్వహిస్తున్నాడు. బడ్జెట్ ఎక్కువ అవుతున్నా, కథపై నమ్మకంతో ఖర్చుకు వెనుకాడలేదు. దీపావళికి పండగ పూట పోటీ ఎక్కువ ఉన్నా, లాంగ్ వీకెండ్ కోసం రిస్క్ తీసుకొని విడుదల చేస్తున్నాడు. పైగా తమిళంలో థియేటర్లు దొరకలేదు. ఒక వారం ఆలస్యంగా అక్కడ విడుదల అవుతోంది. ఈ ఇబ్బందులన్నీ భరిస్తూ విడుదలకు రంగం సిద్ధం చేసుకున్నాడు కిరణ్.

ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయట. ఇంటర్వెల్ ట్విస్ట్ తో కథ మరో స్థాయికి వెళ్తుందని, ఇంటర్వెల్ తర్వాత ప్రతి పది నిమిషాలకూ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందని, క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. జాతర సెటప్, అక్కడ వచ్చే పాట ఇవన్నీ ప్లస్ పాయింట్స్ గా మారతాయని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ‘ఇలాంటి కంటెంట్ తో ఇప్పటి వరకు సినిమా రాలేదు. వచ్చింది అని నిరూపిస్తే నేను సినిమాలు మానుకుంటా’ అని కిరణ్ అబ్బవరం ధైర్యంగా స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం ఇదే. బుధవారం నుంచే ‘క’ ప్రీమియర్లు పడబోతున్నాయి. ఒక రోజు ముందే షో వేయడం ఈరోజుల్లో చాలా రిస్కీ. కిరణ్ అందుకు కూడా రెడీ అయ్యారు. మరి ఆయన డేరింగ్ స్టప్ కు ఫలితం వస్తుందో చూడాలి.