కుటుంబంలో తగాదాలు.. అందుకే ముంబైకి షిఫ్ట్.. క్లారిటీ ఇచ్చిన సూర్య !

సూర్య మరియు కార్తి ఎలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. వీరి గురించి గాసిప్పులు కూడా తక్కువే. అయితే, ఇటీవల సూర్య తన భార్య జ్యోతిక మరియు పిల్లలతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. ఈ పరిణామం సూర్యపై కొత్త గాసిప్పులను తెచ్చింది. సూర్య ఉమ్మడి కుటుంబంలో ఉంటాడు. అందరూ కలిసే ఉంటారు. కానీ ఇప్పుడు ఆస్తి పంపకాలు జరిగాయని, కుటుంబంలో తగాదాలు వచ్చాయని, అందుకే సూర్య ముంబైకి వెళ్లిపోయాడని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

‘కంగువ’ ప్రమోషన్లలో భాగంగా సూర్య ముంబై మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంలో ముంబైకి షిఫ్ట్ అవ్వడానికి గల కారణం పంచుకున్నాడు. “జ్యోతిక ముంబైలో ఉండేది. ముంబైతో తనకు 18 ఏళ్ల అనుబంధం ఉంది. నా కోసం చెన్నైకి వచ్చింది. 27 ఏళ్ల పాటు చెన్నైలోనే ఉంది. నా కోసం చాలా త్యాగం చేసింది. ఇప్పుడు ఆమె కోసం, పిల్లల కోసం నేను ముంబైకి వచ్చాను” అని స్పష్టం చేశాడు.

దీంతో ఆస్తి పంపకాలు, కుటుంబ కలహాలపై సూర్య స్పష్టత ఇచ్చినట్టైంది. సూర్య మరియు కార్తి అనుబంధం ఇప్పటికీ బలంగానే ఉంది. ఇటీవల కార్తి హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ చిత్రానికి సూర్య నిర్మాత. ‘కంగువ’లో కార్తి గెస్ట్ రోల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు ఉంటే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? సూర్య మరియు కార్తి కలిసి ఒక సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకు సంబంధించిన కథ కూడా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. ఈ సినిమా మొదలైతే, ఈ గాసిప్పులన్నింటికీ ఒకేసారి పుల్ స్టాప్ పెట్టినట్టవుతుంది.