ఉత్తమ్ మళ్లీ.. అదే మాట !
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గట్టి నమ్మకంతో ఉన్నారు ఆ పార్టీ పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన సమావేశంలో ఇదే చెబుతున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో పాటు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారు. తాజాగా, భైంసాలో చేపట్టిన రాహుల్ ఎన్నికల ప్రచార సభలో ఉత్తమ్ ఇదే చెప్పారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఆ కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా పరామర్శించలేదని మండిపడ్డారు.
అదే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి 15 కి.మీల పాదయాత్ర చేసి రైతులకు సంఘీభావం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ఉత్తమ్ ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్ 12న రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మరోసారి స్పష్టం చేశారు. ఇక, రాహుల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ కు నూతన ఉత్సాహం వచ్చినట్టు కనబడుతోంది. ఇకపై ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు డిసైడ్ అయినట్టు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఐతే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఖరారు చేయకపోవడం గమనార్థం.