టికెట్ రాకున్నా.. పదవులొస్తాయ్.. !

ఈ ఎన్నికల్లో టికెట్ దొరక్కపోయినా.. ఏర్పడబోయే ప్రభుత్వంలో మాత్రం పదవులు దక్కబోతున్నాయి. ఈ ఆఫర్ కేవలం తెలంగాణ టీడీపీ నేతలకు మాత్రమే. ఈ మేరకు వారికి ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో చంద్రబాబు టీ-టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహాకూటమిలో పార్టీకి 12 సీట్లు మాత్రమే దక్కేలా ఉన్నాయని నేతలు చంద్రబాబుకు తెలిపారు. తాము 20సీట్లు అడుగుతున్నా.. 10-12 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించేలా కనబడుతోందని చెప్పారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు టికెట్ దొరకని నేతలు నిరాశపడొద్దు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రం, కేంద్రంలోనూ నేతలకు పదవులు దక్కనున్నాయి. ఎమ్మెల్సీ, కార్పోరేట్ చైర్మెన్ల వంటి పదవులు వస్తాయి. అసమ్మతి లేకుండా మహాకూటమి అభర్థుల గెలుపుకోసం కృషి చేయండి. గెలిచే స్థానాలని మాత్రమే తీసుకోండని నేతలకు సూచించారు చంద్రబాబు. బాబు లాజిక్కు బాగానే ఉంది. ఆయన భావించినట్టుగా రాష్ట్రంలో, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడితే.. టీ-టీడీపీ నేతలకు ఏదో పదవి దక్కవచ్చు. లేదంటే.. ప్రభావం కోల్పోయిన పార్టీలు వారు ఉండి చేసేది ఏమీ ఉండదేమో.. !