మురగదాస్’పై పొలిటికల్ దాడి !
కోలీవుడ్ లో మురగదాస్-విజయ్ లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. టాలీవుడ్, బాలీవుడ్ కెళ్లి అక్కడ సత్తా చాటాయి. ఈ నేపథ్యంలో విజయ్-మురగ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘సర్కార్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాపై దాదాపు రూ. 100కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఐతే, విడుదలకు ముందు ‘సర్కార్’పై కాపీ వివాదం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది.
‘సర్కార్’ కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మురగదాస్.. వరుణ్ కథకు, నా కథకు ఉన్న పోలిక ఒక్కటే. ఇద్దరి కథలు ఓట్లను ఎలా దుర్వినియోగం చేశారు ? అన్న నేపథ్యంలో ఉంటాయి. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చోటుచేసుకున్న సన్నివేశాలన్నీ సర్కార్ లో చూపించాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి కూడా ప్రస్తావించాం. వరుణ్ 2007లో కథ రాసుకున్నారు. అలాంటప్పుడు జయలలిత మరణం గురించి అందులో ఎలా ప్రస్తావిస్తారు ? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై కోర్టులోనే తేల్చుకొంటామని మురగ తెలిపారు.
ఐతే, సర్కార్ పై ఇలాంటి వివాదాన్ని ముందే ఊహించారు. అసలే ఎన్నికల కాలం. అందులోనూ పొలిటికల్ బ్యాక్ డ్రామ్ లో సినిమా. అది కూడా ప్రస్తుత తమిళ రాజకీయాల ప్రస్తావన. దాన్ని ప్రతిపక్ష పార్టీకి చెందిన నిర్మాత నిర్మించారు. ఈ నేపథ్యంలో సర్కార్ పొలిటికల్ దాడి ఉంటుందనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. ఇప్పుడదే జరుగుతోంది. మరీ.. ఈ పొలిటికల్ దాడిని దర్శకుడు మురగదాస్ ఎలా ఎదుర్కొంటాడు ? సర్కార్ పై పడిన కాపీ మరక పోతుందా.. ?? అనేది చూడాలి.