చంద్రబాబు ఎంట్రీ.. కేసీఆర్ దుకాణం బంద్ !?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు ఎక్కడ, ఎలా తలపడినా రంజుగా ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరి పేర్లు కేంద్రంలో గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో కేంద్రంలో థ్రర్డ్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీకి దగ్గరైనట్టు కనబడింది. తెలంగాణలో ముందస్తు వెళ్లిన సమయంలోనూ బీజేపీతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకొన్నట్టు ప్రచారం జరిగింది.
అదేటంటే.. ? ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భాజాపా సహకరించడం. ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత కూడా టీఆర్ఎస్ భాజాపాకు సహకరించడమని తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రయత్నాలు మొదలెట్టి.. వదిలిపెట్టిన థర్డ్ ఫ్రెంట్ జాడే లేకుండా పోయింది. ఇప్పుడు కేసీఆర్ మళ్లీ థర్డ్ ఫ్రెంటు అని మొత్తుకొన్న ఎవరు నమ్మేటట్టు లేరు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి దేశంలోని ప్రతిపక్షాలన్నింటిని ఏకం చేసే పనిని మొదలెట్టాడు.
గురువారం ఢిల్లీలో చంద్రబాబు రాహుల్ గాంధీతో భేటీ కావడం.. ఉమ్మడిగా ఓ ప్రకటన చేయడం కూడా అయిపోయాయి. గతం గత: దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి పని చేయబోతున్నామని చంద్రబాబు ప్రకటించేశారు. చంద్రబాబు ముందుకురావడంతో.. ఆయన పాటు తృణమూల్, ఎస్పీ, సీపీఐ.. తదితర పార్టీలు కాంగ్రెస్ తో కలిసి ఎన్ డీయే పై పోరుకు సిద్ధం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావించిన కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.