రెహమాన్ పై నెగటివ్ టాక్
ఎఆర్ రెహమాన్.. దేశం గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకుడు. దేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఆయనది. రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు అందుకొన్న ప్రతిభాశాలి. ఏఆర్ రెహ్మన్ సంగీతం సినిమాని ఓ మెట్టు ఎక్కించేలా ఉంటుంది.
ఐతే, తొలిసారి రెహమాన్ మ్యూజిక్ పై నెగటివ్ టాక్ వినబడుతోంది. మురగదాస్-విజయ్ ల కలయికలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘సర్కార్’. దీపావళీ కానుకగా సర్కార్ సోమవారం (నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందించడంతో.. పాటలు, నేపథ్య సంగీతం అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని భావించారు. ఐతే, ప్రేక్షకులని రెహమాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. సినిమాలో రెహమాన్ మార్క్ పెద్దగా కనిపించలేదు. పాటలు సాదాసీదాగా ఉన్నాయి.
నేపథ్యం సంగీతంలోనూ రెహమాన్ మార్క్ మెరుపులు లేవు. రెహమాన్ సంగీతం సినిమాకు మైనస్ గా మారిందని రివ్యూలు చెబుతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకుడి మాట ఇదే. ఇది రెహమాన్ అభిమానులకి అస్సలు నచ్చడం లేదు. ఇంతకీ ‘సర్కార్’ విషయంలో రెహమాన్ ఇలా ఎందుకు చేసినట్టు అని చర్చించుకొంటున్నారు. ఈ సినిమా సమయంలో రెహమాన్ శంకర్ ‘2.ఓ’తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ కోసం రెహమాన్ స్వయంగా రంగంలోకి దిగి ఉండరు. ఆయన శిష్యులు సర్కార్ కోసం పని చేసి ఉంటారు. బిజీ షెడ్యూల్ కారణంగా రెహమాన్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాని వదులుకొన్న సంగతి తెలిసిందే.
అలాంటిది ‘సర్కార్’ సంగీతం అందించేందుకు ఆయన ఒప్పుకొన్న సమయంలోనూ ఇలాంటి సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు ఈ సినిమా సంగీతంపై నెగటివ్ టాక్ రావడంతో సైరా నుంచి రెహమాన్ తప్పుకొని మంచిపని చేశాడని మెగాస్టార్ ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు. ఏదేమైనా రెహమాన్ ఇలా చేయడం ఏమీ బాగూలేదు. ఆయన సంగీత శిఖరం. ఆయనపై ఇలాంటి నెగటివ్ టాక్ వస్తే… ఆయన అభిమానులుగా ఇలాంటివి తట్టుకోలేం. ఇకపై అయినా రెహమాన్ మేజిక్ మిసి కాకుండా జాగ్రత్త పడితే మంచిది.