‘మహాకూటమి’లో సీపీఐకి అన్యాయం ! మరీ.. బయటికి వస్తారా ?
తెలంగాణలో ‘మహాకూటమి’ సీట్ల సర్థబాటు ఓ కొలిక్కివచ్చింది. టీడీపీ 14, టీజెఎస్ 8, సీపీఐ 3, ఇతర పార్టీలు ఒక్క స్థానంలో పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు గురువారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కుంతియా ప్రకటించారు. ఐతే, మహాకూటమిలో సీట్ల సర్థుబాటుపై ఇంకా స్పష్టత రాలేదని నేతల మాటలని బట్టి అర్థమవుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఒప్పుకొన్నారు. శుక్రవారం సీట్ల సర్థుబాటు – స్థానాల కేటాయింపు పై స్పష్టత రావాల్సి ఉంది. ఐతే, కుంతియా, ఉత్తమ్ లు దుబాయ్ లో ఉన్నందున చర్చలు పూర్తి కాలేదని తెలిపారు. ఇక, సీట్ల సర్థుబాటుపై సీపీఐ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
మహాకూటమి సీట్ల సర్దుబాటులో సీపీఐకి అన్యాయం జరిగిందని ఆ పార్టీ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. మూడు స్థానాలకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. టీ టీడీపీ, కాంగ్రెస్ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరిసారి కుంతియా, ఉత్తమ్ లతో భేటీ తర్వాత తుది నిర్ణయం తీసుకొంటాం అనట్టు చాడ మాట్లాడారు. మహాకూటమిలో సీపీఐ ఆశిస్తున్నట్టు మరికొన్నిసీట్లు లభించనట్టయితే… ఆ పార్టీ కూటమి నుంచి బయటికొస్తుందా.. ? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు, సీపీఐ కి మూడు స్థానాలతో పాటు, మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు సమాచారమ్. రేపటి ముచ్చట పక్కన పెట్టి ఈ ఎన్నికల సీట్లపైనే సీపీఐ పట్టుబడుతోంది.