పొన్నాలకి దక్కని అవకాశం !!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకి ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో పొన్నాలకి స్థానం లభించలేదు. పొన్నాల సొంత నియోజవర్గం జనగాం విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని టీజెఎస్ ఆశిస్తోంది. అక్కడి నుంచి టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ బరిలోకి దిగబోతున్నట్టు ప్రసారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నిజం లేదని కొట్టిపారేశారు. అదే జరిగితే తాను నేరుగా అధిష్టానంతో మాట్లాడుకొంటానని తెలిపారు. ఇప్పుడు అదే జరిగింది. తొలి జాబితాలో పొన్నాలకి చోటు దక్కలేదు.
రెండో జాబితాలోనూ పొన్నాలకి నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ? కోదండరాం కోసం కాంగ్రెస్ రెండు నియోజకవర్గాలని (జనగాం, రామగుండం) సూచించింది. ఈ రెండింటిలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది కోదండరాం ఇష్టమని పేర్కొంది. ఐతే, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో రామగుండం టికెట్ ని ఎమ్ ఎస్ రాజ్ ఠాకూర్ కి కేటాయించింది. ఈ నేపథ్యంలో కోదండరాం జనగాం నుంచి బరిలోకి దిగడం ఖాయమైపోయిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే పొన్నాలకి అధిష్టానం మొండిచేయి చూపించినట్టే. మరే విధంగానైనా పొన్నాలకి న్యాయం చేస్తారో చూడాలి.