కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ కూతురు సుహాసిని !


తెలంగాణ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ బరిలోకి దిగబోతుందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తెరపై ఎమ్మెల్యేగా కనిపించిన కళ్యాణ్ రామ్ నిజ జీవితంలోనూ ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్నాడు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ నియోజకవర్గం నుంచి తెలంగాణ టీడీపీ అభ్యర్థిగా నిలబడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ ప్రచారం నిజం కానుంది. కాకపోతే బరిలోకి దిగేది కళ్యాణ్ రామ్ కాదట. ఆయన సోదరి సుహాసిని. కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ కూతురు సుహాసిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారమ్. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

మహాకూటమిలో భాగంగా తెలంగాణ టీడీపీ 14స్థానాలు దక్కాయి. ఇందులో ఇప్పటికే 9 స్థానాలకి టీడీపీ అభ్యర్థులని సైతం ప్రకటించింది. మిగిలిన ఆరు స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కూకట్ పల్లి స్థానం నుంచి హరికృష్ణ కూతురు సుహాసిని బరిలోకి దించనున్నారని టీడీపీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. హరికృష్ణ మరణం తర్వాత నందమూరి, నారా ఫ్యామిలీ మధ్య అంతరం తగ్గింది. కళ్యాణ్ రామ్, ఎన్ టీఆర్ లు బాబాయ్ బాలకృష్ణ, మామ చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ కూతురిని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా నందమూరి ఫ్యామిలీ ఐక్యమత్యాన్ని చాటబోతున్నట్టు చెబుతున్నారు.

మరోవైపు, ఈ స్థానం నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. ఈ మేరకు కార్యకర్తలని సంకేతాలిచ్చారు. ఇలాంటి నేపథ్యంలో హరికృష్ణ కూతురు సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదనని టీడీపీ నేతలు ఆ పార్టీ అధినేత చంద్రాబాబు దృష్టికి తీసుకెళ్లారు. మరీ.. దీనిపై బాబు ఏ నిర్ణయం తీసుకొంటారు ? సుహాసిని అవకాశం ఇస్తారా ?? అన్నది చూడాలి.