కేటీఆర్ పొలిటీషన్ కాదు.. రైతు !

పొలిటీషియన్స్ అంతా పొలిటీషియన్స్ కారు. వారిలో రైతులు కూడా ఉంటారు. తెలంగాణ ఆపదర్మ మంత్రి కేటీఆర్ కూడా రైతే. అవును.. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన వృత్తి వ్యవసాయమని కేటీఆర్ పేర్కొన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మంత్రి కేటీఆర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించారు. అఫిడవిట్‌లో తనకు రూ.1.30కోట్ల స్థిరాస్తులు, రూ.3.63 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.33.28 లక్షలు అప్పు ఉందని, తనపై మొత్తం 16 కేసులు ఉన్నాయని తెలిపారు. తన భార్య పేరు మీద రూ.8.98 కోట్ల స్థిరాస్తి ఉందని, రూ.27.70 కోట్ల చరాస్తులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆమె పేరు మీద రూ.27.39 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం కేటీఆర్ చేతిలో రూ.1,42,594 నగదు, ఆయన భార్య చేతిలో రూ.1,08,231 నగదు ఉన్నట్లు తెలిపారు. ఐతే, కేటీఆర్ తన వృత్తి వ్యవసాయం అని పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. బహుశా.. తండ్రి కేసీఆర్ మాదిరిగా తానూ రైతు పక్షపాతినే అని చెప్పుకోవడానికి కేటీఆర్ వృత్తి వ్యవసాయంగా పేర్కొన్నట్టున్నాడని చెప్పుకొంటున్నారు.