ఈసారి చంద్రబాబుని తరిమికొట్టే బాధ్యత ప్రజలదే.. !


ఓ సారి తాను చంద్రబాబును తరిమేశాను. ఈసారి మాత్రం ఆ బాధ్యత తెలంగాణ ప్రజలదేనని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్’లో ఈ రోజు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఎప్పటిలాగే మహాకూటమి పార్టీలని ఏకిపారేశారు. చంద్రబాబు పెత్తనం వస్తే తెలంగాణ దరఖాస్తులను పట్టుకుని విజయవాడకు పోవాల్సివస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టవద్దని 35 లేఖలు రాసిన వ్యక్తి, ఇప్పుడు మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు కట్టనిస్తాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విజయవాడ బానిసలు, ఢిల్లీ గులాములు అవసరం లేదని స్పష్టం చేశారు.

మళ్లీ టీఆర్ఎస్’ని గెలిపిస్తే వికలాంగులకు రూ.2,016, నిరుద్యోగులకు రూ.3,016 అందజేస్తాం. కల్యాణలక్ష్మి పథకం విషయంలో ముందు భయపడ్డాం. తొలుత దళిత, మైనారిటీలకు వీటిని అందించాలని భావించాం. ఐతే, ప్రజల నుంచి విశేష ఆదరణ రావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మిగతా సామాజిక వర్గాల్లోని ప్రజలకు కల్యాణ లక్ష్మిని విస్తరించామన్నారు. ఈ పథకం ఇప్పుడు విజయవంతమయిందన్నారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పగలురాత్రి కష్టపడి ప్రణాళికలు వేశానని అన్నారు. తమ అకుంఠిత దీక్ష కారణంగానే 24 గంటలపాటు విద్యుత్ ను అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.