తెలంగాణ గొప్పదనం మోడీ మాటల్లో.. !

తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి విచ్చేశారు. నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ తెలంగాణ గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ‘నిజామ్‌ ఆగడాలను ధైర్యంగా ఎదిరించిన నేల ఇది. మార్పు కోసం, ప్రగతి కోసం, అమరుల ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. గోదావరి, కృష్ణ, మంజీరా వంటి పుణ్యనదులు ప్రవహించే భూమి తెలంగాణ. తెలంగాణకు ఎంతో చరిత్ర ఉంది’ అన్నారు

నవ తెలంగాణ నిర్మాణం విషయంలో తెరాస సర్కార్ ఘోరంగా విఫలమైంది. యువతకు ఉద్యోగ, ఉపాధి, రైతులకు లబ్ధి, సాగునీరు వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ వైఫల్యాలపై ముఖ్యమంత్రిని నిలదీయాల్సిన ఎన్నికలు ఇవని మోడీ అన్నారు. అమరుల ఆకాంక్షలను పక్కన పెట్టేసిన వారు మరోసారి అధికారంలోకి రాకూడదని పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారాన్నికి వచ్చే ముందు తెలంగాణ ప్రజలని ఉద్దేశించి మోడీ ట్విట్ చేశారు. ‘నా ప్రియాతి ప్రియమైన తెలంగాణా సోదర సోదరీమణులారా!! ఇవాళ మన తెలంగాణా గడ్డ మీద అడుగుపెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను… మొదట నేను నిజామాబాద్ ర్యాలీలో మాట్లాడిన తరువాత మహబూబ్‌నగర్‌లో మీతో నా భావాలు పంచుకొంటాను.. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడానికి మీ ఆదరాభిమానాలు, ఆశీస్సులను కోరుకుంటున్నాను. NM Mobile app ద్వారా ఈ ర్యాలీ విశేషాలను నిరంతరం చూడండి’ అని మోదీ ట్వీట్‌ చేశారు.