రివ్యూ : 2.ఓ – మాస్టర్ పీస్
చిత్రం : 2.ఓ (2018)
నటీనటులు : రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్.. తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్
దర్శకత్వం : శంకర్
నిర్మాత : (లైకా ప్రొడక్షన్స్) ఎ.సుభాష్‌కరణ్, రాజు మహాలింగం
విడుదల తేదీ : 29నవంబర్, 2018
రేటింగ్ : 4/5
భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుడు శంకర్. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి శంకర్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ జతకలిస్తే ఎలా ఉంటుంది అనేది ‘రోబో’తో చూశాం. ఈ సినిమా సీక్వెల్ ‘2.ఓ’ కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడా నిరీక్షణ ఫలించింది. 2.ఓ వచ్చేసింది. మరీ.. రోబోతో పోలిస్తే ‘2.ఓ’లో ఉన్న ప్రత్యేకతలేంటి ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొన్నాయి తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
ఉన్నట్టుండి భూమ్మీద అందరి సెల్ఫోన్లూ మాయమైపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్‌ని చీల్చుకుంటూ మరీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి ప్రపంచం మొత్తం నివ్వెరపోతుంది. భూమ్యాకర్షణ శక్తికి మించి ఏదో బలమైన శక్తి సెల్ ఫోన్లని లాక్కెళ్లిపోతోందని శాస్త్రవేత్తలు గ్రహిస్తారు. ఇంతలో సెల్ఫోన్లన్నీ అమర్చుకున్న ఓ పక్షి ఆకారపు రూపం నగరంలో చొరబడి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు ఓ నిర్ణయం తీసుకుంటారు. చిట్టి ‘ద రోబో’ని మళ్లీ రంగంలోకి దింపాలని భావిస్తారు. వశీకర్ (రజనీకాంత్) ఆ ప్రయత్నంలో విజయవంతం అవుతాడు.
అలా చిట్టి మళ్లీ రంగ ప్రవేశం చేసి – అత్యంత బలమైన పక్షిరాజు (అక్షయ్ కుమార్)ని ఎలా ఎదుర్కొంది ? అసలు ఆ పక్షిరాజు కథేమిటి ? చిట్టి-పక్షిరాజుల మధ్య ఆధిపత్యపోరు ఎలా సాగింది ?? అనేది 2.ఓ కథ.
ప్లస్ పాయింట్స్ :
* విజువల్ ఎఫెక్ట్స్
* రజనీ, అక్షయ్ ల నటన
* చిట్టి – పక్షిరాజు పోరాటాలు
* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
* క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
* కథ ఎమోషనల్ గా సాగలేదు
ఎలా ఉందంటే ?
సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకుని, వాటిని సాంకేతికంగా ఉన్నతంగా చూపిస్తుంటాడు దర్శకుడు శంకర్. 2.ఓ విషయంలో ఆయన సెల్ఫోన్లపై ఫోకస్ పెట్టాడు. సెల్ ఫోన్ల వల్ల వచ్చే శబ్దతరంగాల వల్ల ప్రకృతి ఎంత నష్టపోతోందో, భవిష్యత్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వస్తుందో… ఈ సినిమాలో కళ్లకు కట్టారు.
సెల్ ఫోన్స్ మాయమైపోవడం అనే సమస్యతో నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. ఆ సమస్యకు కారణం పక్షిరాజు. ఇంతకీ పక్షిరాజు అలా మారాడానికి కారణం ఏంటన్నీదని సెకంఢాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ లో చూపించేశాడు. అంతకంటే ముందు పక్షిరాజు చేసే విధ్వాంసాలు, చిట్టితో పోరాట సన్నివేశాలు అద్భుతంగా చూపించాడు.
ఎక్కడ కథకి అడ్డుపడే సన్నివేశాలు రాకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. ఇందులో భాగంగా తొలిభాగంలో ఒక్క సాంగ్ ని కూడా పెట్టలేదు. కేవలంలో కథతో ప్రేక్షకుడిని కనెక్ట్ చేసేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కసారి పక్షిరాజుతో పోరాడేందుకు చిట్టి రోబో రంగంలోకి దించిన తర్వాత సినిమాని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. సెకాంఢాఫ్ లో చిట్టి-పక్షిరాజు ఆధిపత్యపోరు హైలైట్.
ఇవన్నీ విజువల్ వండర్ గా చూపించేశారు దర్శకుడు. వాటిని మాటల్లో చెప్పడం కష్టం. చూసి అనుభవించాల్సిందే. సినిమాలో చివరి 40 నిమిషాలు అదిరిపోయింది. ఐతే, ఎమోషనల్ గా ఈ కథని మలచలేకపోయాడు. పక్షిరాజు ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ లో మాత్రమే ఎమోషన్ పండింది. మొత్తంగా ఊహించిన దానికంటే మించేలా 2.ఓ ఉంది.
ఎవరెలా చేశారంటే ?
దర్శకుడు శంకర్ కథ కంటే.. ఈ సినిమాని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడంపైనే దర్శకుడు ఫోకస్ పెట్టాడు. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ మూడు పాత్రల్లో అదరగొట్టాడు. ఈ వయసులోనూ రజనీ ఎనర్జీ ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. పక్షిరాజు పాత్రలో అక్షయ్ కుమార్ గెటప్ బాగుంది. ఆ పాత్రలో అక్షయ్ నటన అదిరిపోయింది. రజనీ, అక్షయ్, ఎమీ జాక్సన్ మధ్యే కథ నడుస్తోంది. ఎమీ జాక్సన్ కి ఉన్నంతలో బాగానే చేసింది.
సాంకేతికంగా :
సాంకేతిక విషయాన్నే కథగా ఎంచుకొన్నారు. టెక్నాలజీకే పెద్ద పీట వేశాడు. పాటలు సాదాసీదాగా అనిపించినా.. నేపథ్య సంగీతంలో ఆర్.ఆర్‌లో రెహమాన్ మార్క్ కనిపించింది. నీరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఇండియన్ సినిమాలో 4డీ సౌండ్ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లారు రసూల్. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
బాటమ్ లైన్ : 2.ఓ – మాస్టర్ పీస్
రేటింగ్ : 4/5