సచిన్‌ గురువు అచ్రేకర్‌ కన్నుమూత


క్రికెట్‌ దిగ్గజం, సచిన్‌ టెండూల్కర్‌ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ముంబైలో దాదార్‌లోని శివాజీరాజ్ పార్కులో రమాకాంత్‌ ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు. సచిన్‌ టెండూల్కర్‌, వినోద్‌ కాంబ్లి, ప్రవీన్‌ ఆమ్రె, సమీర్‌ దిఘె, బల్విందర్‌ సింగ్‌ సంధు, అజిత్‌ అగార్కర్‌ వంటి క్రికెటర్లకు ఆయన శిక్షణ నిచ్చారు. అచ్రేకర్‌ను తన మార్గదర్శకునిగా సచిన్‌ ఎన్నోసార్లు చెప్పారు. ప్రతి గురుపౌర్ణమికి ఆయన ఇంటికి వెళ్లి గౌరవించేవారు. శాలువా కప్పి సత్కరించేవారు.

1932లో అచ్రేకర్‌ జన్మించారు. 1943లో క్రికెట్‌ ఆడటం ప్రారంభించారు. ఆయన క్రికెట్‌ కెరీర్‌ అంత సవ్యంగా సాగలేదు. 1945లో న్యూ హిందు స్పోర్ట్స్‌ క్లబ్‌ తరఫున ఆడారు. యంగ్‌ మహారాష్ట్ర ఎలెవన్‌, గుల్‌ మోహర్‌ మిల్స్‌, ముంబయి పోర్ట్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1963-64 మొయిన్‌ద్దౌలా టోర్నీలో ఆల్‌ ఇండియా స్టేట్‌ బ్యాంకు జట్టు తరఫున హైదరాబాద్‌పై ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. ఆయన్ని 1990లో ద్రోణాచార్య అవార్డుతో, 2010లో పద్మశ్రీ అవార్డులతో కేంద్రప్రభుత్వం సత్కరించింది.