టీడీపీ ఎంపీలపై కేంద్ర మంత్రి గోయల్‌ ఫైర్

పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళనకి దిగారు. ఏపీ విషయంలో కేంద్రం ఇచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఐతే, టీడీపీ ఎంపీల తీరుపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు. ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఏపీ అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేయడం, ఆ తర్వాత మీరు సంబరాలు చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా ? అంటూ ప్రశ్నించారు గోయల్.

టీడీపీ-కాంగ్రెస్‌ కలవడం ఇష్టపడని తెలంగాణ ప్రజలు తగిన బుద్ధిచెప్పి పంపారు. ఆంధ్రాలోనూ బాబుకు గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు కేంద్రమంత్రి గోయల్. హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీతోనే డబుల్ లాభం ఉంటుందని ఆనాడు అంగీకరించిన టీడీపీ నేతలు ఇప్పుడు హోదా పేరుతో పార్లమెంటు ముందు ఎందుకు డ్రామాలు అడుతున్నారని ప్రశ్నించారు.