బ్రేకింగ్ : అగ్రకులాకు10% రిజర్వేషన్లు
దేశంలోని అగ్రకులాల వారికి గుడ్ న్యూస్. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ నిర్ణయంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
తాజా కేబినెట్ నిర్ణయంతో జనరల్ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ఐతే, సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండటంతో అగ్రకులాల వారిని ఆకట్టుకొనేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పరిమితి విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.